ఐసీయూలో హుజురాబాద్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి..

హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ అభ్యర్థి గా నిలబడిన బల్మూరి వెంకట్..ప్రస్తుతం ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తలపెట్టిన విద్యార్థి నిరుద్యోగ జంగ్ కార్యక్రమంలో వెంకట్ కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఎల్బీనగర్ లో ఉన్న శ్రీకాంత్ చారి విగ్రహానికి నివాళులర్పించేందుకు రేవంత్ రెడ్డి, బల్మూర్ వెంకట్ తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రక్తతకు దారితీసింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీ చార్చ్ చేయగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిలో బల్మూరి వెంకట్ కూడా ఉన్నారు. వెంకట తీవ్ర అస్వస్థతకు గురై గాయాలతో కిందపడిపోయారు. దాంతో కార్యకర్తలు ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వెంకట్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఎన్నికల సమయంలో వెంకట్ అస్వస్థతకు గురవడం కాంగ్రెస్ శ్రేణులను ఆందోళన కు గురి చేస్తోంది.

ఇక వెంకట్ విషయానికి వస్తే..2015, 2018లో జరిగిన ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన వరుసగా రెండుసార్లు గెలుపొందారు. 2017లో ఎన్‌ఎస్‌యూఐ జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఎంబీబీఎస్‌ చదివిన వెంకట్‌ది పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాం పూర్‌ మండలం తారుపల్లి గ్రామం. అవివాహితుడయిన వెంకట్‌ (29) విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఆయనను పార్టీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించడం పట్ల కాంగ్రెస్‌ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పట్ల నిబద్ధత, విధేయత కలిగి క్రమశిక్షణతో పనిచేసే యువనాయకత్వానికి కాంగ్రెస్‌ ఎప్పుడూ గౌరవం ఇస్తుందన్న విషయం వెంకట్‌ ఎంపికతో మరో మారు నిరూపితమయిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంఆర్‌జీ వినోద్‌రెడ్డి వ్యాఖ్యానించారు.