‘చైనీస్ గూఢచారి బెలూన్’ ..వివరాలను భారత్‌తో పంచుకున్న అమెరికా

కూల్చివేత ఆపరేషన్ నిర్వహించిన తీరును వివరించామన్న ఎయిర్ ఫోర్స్ జనరల్

US shares details on how ‘Chinese spy balloon’ was shot down with India and others

న్యూఢిల్లీః ఇటివల అమెరికా గగనతలంపై చైనా నిఘా బెలూన్‌ను కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంకు సంబంధించిన వివరాలను అమెరికా అధికారులు భారత్ తో పాటు మరికొన్ని దేశాలతోనూ పంచుకున్నట్లు అమెరికా ఉన్నతాధికారులు తెలిపారు. ఈమేరకు అమెరికాకు చెందిన పసిఫిక్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ కెన్నిత్ విల్స్ బాష్ ఈ వివరాలను వెల్లడించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) తో సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఎక్స్ కోప్ ఇండియా 23’ కార్యక్రమం కోసం సోమవారం విల్స్ బాష్ ఢిల్లీ చేరుకున్నారు. ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌదరీతో విల్స్ బాష్ భేటీ అయ్యారు. ఇరు దేశాల పరస్పర ప్రయోజనాలపై చర్చించారు.

ఐఏఎఫ్ చీఫ్ తో భేటీ తర్వాత విల్స్ బాష్ మీడియాతో మాట్లాడారు. అమెరికా గగనతలంపై కలకలం సృష్టించిన చైనా బెలూన్ ను కూల్చివేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను భారత దేశంతో పంచుకున్నట్లు విల్స్ బాష్ చెప్పారు. బెలూన్ కూల్చివేత విషయంలో పరిగణలోకి తీసుకున్న అంశాలు, కూల్చివేత సందర్భంగా ఎదురైన సవాళ్లు, బెలూన్ లో మనుషులు ఉంటే తీసుకోవాలనుకున్న చర్యల గురించి భారత అధికారులకు సంక్షిప్తంగా వివరించామని తెలిపారు.