తనని సస్పెండ్ చేస్తే బీఆర్ఎస్ కే నష్టం – జూపల్లి

పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నారంటూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జూపల్లి కృష్ణారావు మంగళవారం తన అనుచరులతో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో మాట్లాడుతూ.. తనని సస్పెండ్ చేస్తే బీఆర్ఎస్ కే నష్టమని జూపల్లి అన్నారు. ఈ క్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డిపై జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేసారు. నిరంజన్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని… తమ నియోజకవర్గంలో జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తే తప్పా అని జూపల్లి ప్రశ్నించారు. పరిపాలన గురించి తాను చాలా సార్లు మాట్లాడానని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు సర్పంచ్ లు గోస పడుతున్నారని చెప్పారు. తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదని జూపల్లి స్పష్టం చేశారు. ఇప్పటివరకు తాను ఆడిగిన ప్రశ్నలకు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పలేదన్నారు.

మరోపక్కమంత్రి జూపల్లి కృష్ణారావుతో బీజేపీ నేతలు టచ్‌లోకి వెళ్లారు. తమ పార్టీలో చేరాల్సిందిగా ఆయనను కోరుతున్నారు. మాజీ మంత్రి డీకే అరుణ మంగళవారం జూపల్లికి ఫోన్ చేశారు. ఆయనను బీజేపీలో చేర్చుకునే ప్రయత్నాల్లో సంప్రదింపులు జరుపుతున్నారు. దీంతో జూపల్లి బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. తమ పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని కాషాయ నేతలు హామీలు ఇస్తున్నారు. దీంతో తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు నేడు కొల్లాపూర్ నియోజకవర్గంలో తన అనుచరులతో జూపల్లి భేటీ అయ్యారు. బీజేపీతో పాటు కాంగ్రెస్ నుంచి కూడా జూపల్లికి ఆఫర్లు వస్తున్నాయి. దీంతో సాయంత్రం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ పార్టీలో చేరితే బాగుంటుందనే దానిపై కార్యకర్తలతో సమాలోచనలు జరుపుతున్నారు. చర్చించిన తర్వాత ఏ పార్టీలో చేరాలనే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.