అమెరికా వీసాలు.. యుఎస్ ఎంబసీ సరికొత్త రికార్డు

ఈ ఏడాది ఇప్పటివరకు భారతీయులకు 10 లక్షల వీసాలు ఇచ్చిన అమెరికా

US authorities aim to process over 10 lakh non-immigrant visa applications in India in 2023

న్యూఢిల్లీః భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం వీసాల జారీలో రికార్డు సృష్టించింది. 2023లో ఇప్పటివరకు 10 లక్షలకు పైగా వీసాలు జారీ చేసింది. గతంలో ఓ ఏడాది కాలంలో అమెరికా ఎంబసీ ఎప్పుడూ ఇన్ని వీసాలు జారీ చేయలేదు. ఇప్పుడు కొన్ని నెలల వ్యవధిలోనే ఏకంగా ఒక మిలియన్ వీసాలు జారీ చేసింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అమెరికా జారీ చేసిన వీసాల్లో 10 శాతం భారతీయులకే కేటాయించారు.

ఈ ఘనత పట్ల అమెరికా రాయబార కార్యాలయం హర్షం వ్యక్తం చేసింది. మిషన్ వన్ మిలియన్ పూర్తయిందని తన సోషల్ మీడియా ఖాతాలో సగర్వంగా ప్రకటించింది. ఇది ఇంతటితో ఆగదని, రాబోయే కాలంలో మరింత మంది భారతీయులకు అమెరికా వెళ్లే అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. వీసాల జారీలో మరింత వృద్ధి సాధిస్తామని అమెరికా ఎంబసీ పేర్కొంది.

దీనిపై భారత్ లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ స్పందించారు. ద్వైపాక్షిక సంబంధాల పరంగా తమకు భారత్ ముఖ్యమైన దేశమని తెలిపారు. భారత్ తమకు అత్యంత కీలకమైన బంధం ఉందని పేర్కొన్నారు. ఈ బంధం నిజమైనది అని చాటేలా మున్ముందు రికార్డు స్థాయిలో భారతీయులకు వీసాలు ఇస్తాం అని గార్సెట్టీ వెల్లడించారు.