భార‌త దేశ ప్ర‌గ‌తి కోసం ఆయ‌న త‌పించారుః ప్ర‌ధాని మోడీ

స్వామినాథ‌న్ మృతి ప‌ట్ల రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని నివాళి

President and Prime Minister pay tribute to Swaminathan’s death

న్యూఢిల్లీ: ప్ర‌ఖ్యాత వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త డాక్ట‌ర్ ఎంఎస్ స్వామినాథ‌న్ మృతి ప‌ట్ల రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము, ప్ర‌ధాని మోదీ స్పందించారు. అంత‌ర్జాతీయంగా ఖ్యాతిగాంచిన అగ్రిక‌ల్చ‌ర్ సైంటిస్టు స్వామినాథ‌న్ మృతి త‌న‌కు విషాదాన్ని మిగిల్చిన‌ట్లు రాష్ట్ర‌ప‌తి ముర్ము తెలిపారు. ఆహార భ‌ద్ర‌త కోసం ఆయ‌న అహ‌ర్నిశ‌లు శ్ర‌మించిన‌ట్లు ఆమె పేర్కొన్నారు. హ‌రిత విప్ల‌వానికి జాతిపిత‌గా ఆయ‌న్ను పిల‌వ‌డంలో సందేహం లేద‌న్నారు. వ్య‌వ‌సాయ రంగంలో ఆయ‌న ఎన్నో ఆవిష్క‌ర‌ణ‌లు న‌మోదు చేశార‌ని, దానికి గాను ఆయ‌న‌కు ప‌ద్మ విభూష‌న్‌, వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రైజ్ లాంటి అవార్డులు ద‌క్కిన‌ట్లు రాష్ట్ర‌ప‌తి తెలిపారు. ఆక‌లి లేని స‌మాజాన్ని ఆయ‌న సృష్టించాల‌నుకున్నార‌ని, భార‌తీయ వ్య‌వ‌సాయ క్షేత్రంలో ఆయ‌న చ‌ర‌గ‌నిముద్ర వేశార‌న్నారు.

స్వామినాథ‌న్ మృతి త‌న‌ను బాధ‌కు గురిచేసింద‌ని ప్ర‌ధాని మోడీ అన్నారు. ఎక్స్ అకౌంట్‌లో ఆయ‌న త‌న నివాళి అర్పించారు. చాలా కీల‌కమైన ద‌శ‌లో స్వామినాథ‌న్ చేసిన కృషి వ‌ల్ల వ్య‌వ‌సాయ రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌చ్చాయ‌ని, దాని వ‌ల్ల దేశంలో ఆహార భ‌ద్ర‌త ఏర్ప‌డింద‌న్నారు. ప‌రిశోధ‌నా రంగంలో ఆయ‌న చూపిన మార్గాన్ని అనేక మంది యువ శాస్త్ర‌వేత్త‌లు ఫాలో అయిన‌ట్లు ప్ర‌ధాని తెలిపారు.స్వామినాథ‌న్‌తో ఎన్నో గ‌త స్మృతులు ఉన్న‌ట్లు పేర్కొన్నారు. భార‌త దేశ ప్ర‌గ‌తి కోసం ఆయ‌న త‌పించార‌న్నారు. ఆయ‌న జీవితం, ప‌నిత‌నం ఎంద‌రికో స్పూర్తిగా నిలుస్తుంద‌న్నారు. స్వామినాథ‌న్ కుటుంబ స‌భ్యుల‌కు సంతాపం ప్ర‌క‌టిస్తున్న‌ట్లు ప్ర‌ధాని వెల్ల‌డించారు.