ఆదివారసీపై మూత్ర విసర్జన ఘటనలో కొత్త ట్విస్ట్
బాధితుడు ఒకరైతే.. మరొకరి కాళ్లు కడిగిన మధ్యప్రదేశ్ సీఎం..
భోపాల్: మధ్యప్రదేశ్ మూత్ర విసర్జన ఘటనలో బిగ్ ట్విస్ట్. గిరిజనుడిపై పర్వేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్రం పోసిన ఘటనతో చలించిపోయిన ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ బాధితుడిని ఇంటికి పిలిపించుకుని కాళ్లు కడిగి శాలువా కప్పారు. క్షమించమని వేడుకున్నారు. అయితే, ముఖ్యమంత్రి కాళ్లు కడిగింది బాధితుడు దశ్మత్ రావత్‌కు కాదంటూ కొత్త వాదన తెరపైకి వచ్చింది. మరి సీఎంతో కాళ్లు కడిగించుకున్న ఆ వ్యక్తి ఎవరన్న ప్రశ్న తలెత్తింది. మరోవైపు, నెటిజన్లు కూడా బాధితుడు, సీఎంతో కాళ్లు కడిగించుకున్న వ్యక్తి ఒకరు కాదని చెబుతున్నారు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ‘సుధామ’గా పేర్కొంటున్నారు.
మూత్ర విసర్జనకు సంబంధించిన వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి వయసు 16-17 ఏళ్లకు మించి ఉండవని, సీఎంతో కాళ్లు కడిగించుకున్న వ్యక్తి వయసు 35-38 మధ్య ఉంటుందని చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే బాధితుడు, సీఎంతో కాళ్లు కడిగించుకున్న వ్యక్తి ఒకరు కాదని స్పష్టమవుతోందని అంటున్నారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కూడా ఈ విషయంపై ఇవే ఆరోపణలు చేసింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరివో కాళ్లు కడిగి డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజమైన బాధితుడిని పక్కనపెట్టేశారని, మరీ ఇంత కుట్రా? అని మండిపడింది. సీఎంను మధ్యప్రదేశ్ ప్రజలు క్షమించరని హెచ్చరించింది. అయితే, కుట్ర కోణాన్ని బిజెపి ఖండించింది.