సీఎం జగన్ ఫై ఉండవల్లి కీలక వ్యాఖ్యలు

సీఎం జగన్ ఫై ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. . రాష్ట్ర ప్రయోజనాల పట్ల రాజీ పడితే జగన్ రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడుతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో జగన్ కు సత్సంబంధాలు ఉండవచ్చని, అందులో తప్పు లేదని, అయితే న్యాయంగా రాష్ట్రానికి రావలసిన ప్రయోజనాలపై వెనక్కు తగ్గకూడదని ఉండవల్లి హితవు పలికారు.

బుధవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ విభజనపై తనతో పాటు మరో 22 మంది పిటిషన్లు దాఖలు చేశారన్నారు. రాష్ట్ర విభజనకు అభ్యంతరం లేదని.. ఏపీ ప్రభుత్వం తరఫు లాయర్ అభిషేక్ సింఘ్వీ సుప్రీంకోర్టులో చెప్పారన్నారు. ఇదంతా సీఎం జగన్‌ కు తెలిసే జరుగుతుందా? లేఖ తెలియకుండా జరుగుతుందా? అన్నారు. జగన్‌కు తెలిసే జరిగితే.. ఏపీకి జగన్ ద్రోహం చేసినట్టేనని అన్నారు. రాష్ట్ర విభజన అన్యాయంగా జరిగిందని ఉండవల్లి అన్నారు.

ఇప్పటికే జగన్ అనేక విషయాల్లో రాజీపడినట్లు అర్థం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతిపై ఇటీవల సుప్రీంకోర్టు తీర్పును ఎవరికి వారే తమకు అనుకూలంగా మలచుకున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. అదేరోజు ఏపీ విభజన అంశాలపై చర్చ జరిగిందని, కానీ దానిని ఎవరూ పట్టించుకోలేదన్నారు. విచారణ జరుగుతుండగా ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది హాజరై తాము విభజనకు వ్యతిరేకం కాదని చెప్పారన్నారు. దీనిపై విచారిస్తే పండోరా బాక్స్ ను ఓపెన్ చేసినట్లవుతుందని అన్నారు. ఇది జగన్ కు తెలిసే జరుగుతుందా? నిర్ణయాలు ఎవరైనా తీసుకుంటారా? అన్నది తేలాల్సి ఉందన్నారు.