అలర్జీ ఉంటే.. ఫైజర్‌ టీకా తీసుకోకండి

ఆదేశాలు జారీ చేసిన బ్రిట‌న్ వైద్య నియంత్ర‌ణా అధికారులు

pfizer

లండన్‌: ఫైజర్‌- బయోఎన్‌టెక్‌ సంయుక్తంగా రూపొందించిన టీకాను మంగళవారం నుండి బ్రిటన్‌ ప్రజలకు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొందరికి తీవ్ర అలర్జీ లక్షణాలు కనిపించాయి. అల‌ర్జీ(అనాఫైలాక్సిస్) కేసులు రెండు న‌మోదు అయిన‌ట్లు మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రోడ‌క్ట్స్ రెగ్యులేట‌రీ ఏజెన్సీ త‌న రిపోర్ట్‌లో పేర్కొన్న‌ది. క‌రోనా వైర‌స్ టీకా పంపిణీ ప్రారంభ‌మైన త‌ర్వాత ఈ కేసులు న‌మోదు అయిన‌ట్లు ఆ ఏజెన్సీ వెల్ల‌డించింది. అయితే తాజాగా బ్రిట‌న్ వైద్య నియంత్ర‌ణా అధికారులు కొత్త ఆదేశాలు జారీ చేశారు. తీవ్ర‌మైన అల‌ర్జీ స‌మ‌స్య ఉన్న వాళ్లు ఫైజ‌ర్ టీకాను తీసుకోరాద‌న్నారు. మెడిసిన్ వేసుకుంటే అల‌ర్జీ వ‌చ్చినా.. లేదంటే ఏదైనా ఆహారం ప‌డ‌కున్నా వ‌చ్చే అల‌ర్జీ ల‌క్ష‌ణాలు ఉంటే.. అలాంటి వాళ్లు ఆ టీకాను తీసుకోరాదు అని బ్రిట‌న్ త‌న తాజా ఆదేశాల్లో స్ప‌ష్టం చేసింది.

అల‌ర్జీ ల‌క్ష‌ణాలు ఉన్న వాళ్లు ఫైజ‌ర్‌బ‌యోఎన్‌టెక్ టీకాను వేసుకోవ‌ద్దు అంటూ ఆయ‌న ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. నిజానికి ఈ టీకా తీసుకున్న‌వారిలో ఎక్కువ శాతం మందికి ఎటువంటి అల‌ర్జీ రియాక్ష‌న్లు ఉండ‌వ‌ని, ఇది కోవిడ్‌19 నుంచి ర‌క్ష‌ణ ఇస్తుంద‌ని, ఎంహెచ్ఆర్ఏ సుర‌క్షిత ప్ర‌మాణాల‌కు త‌గిన‌ట్లు వ్యాక్సిన్ ఉంద‌ని ఆయ‌న అన్నారు. ఎంహెచ్ఆర్ఏ చేప‌డుతున్న విచార‌ణ‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ఫైజ‌ర్‌, బ‌యోఎన్‌టెక్ సంస్థ‌లు ప్ర‌క‌టించాయి. ఫైజ‌ర్ సంస్థ రూపొందించిన క‌రోనా టీకాకు బ్రిట‌న్ ఆమోదం తెలుపగా.. అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ, యురోపియ‌న్ మెడిసిన్స్ ఏజెన్సీ మాత్రం ఇంకా ఆ కంపెనీ డేటాను ప‌రిశీలిస్తున్నాయి. అల‌ర్జీ ఉన్న‌వాళ్ల‌కు ఇప్ప‌ట్లో ఫైజ‌ర్ టీకాను ఇచ్చే అవ‌కాశాలు లేవ‌ని అమెరికా అధికారులు కూడా స్ప‌ష్టం చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/