భారత్‌లో అమెజాన్‌ ఇంటర్నెట్‌ సేవలు.. అనుమతి కోసం దరఖాస్తు..!

ప్రాజెక్ట్ కైపర్ పేరిట అమెజాన్ శాటిలైట్ ఆధారిత బ్రాడ్ బాండ్ సేవలు

amazon

న్యూఢిల్లీః మన దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సిద్ధమవుతోంది. నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ నుంచి ఆమోదం లభించిన తర్వాత అమెజాన్ భారత్‌లో స్పేస్ నుంచి బ్రాడ్ బాండ్ సేవలను అందించాలని చూస్తోంది. అదే జరిగితే భారత్‌లో ఎలాన్ మస్క్ స్టార్ లింక్, వన్ వెబ్, జియో శాటిలైట్ మధ్య పోటాపోటీ ఉండనుంది. ప్రాజెక్ట్ కైపర్ పేరిట అమెజాన్ శాటిలైట్ ఆధారిత బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ సేవలను అందించనుంది. ఇందుకోసం వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది.

దీంతో పాటు గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ కోసం కూడా టెలికమ్యూనికేషన్ విభాగానికి దరఖాస్తు చేసుకోనున్నట్లుగా తెలుస్తోంది. అమెజాన్‌కు చెందిన కైపర్ వ్యవస్థలో భాగంగా భూసమీప కక్ష్యలో ఉన్న 3,236 ఉపగ్రహాల నెట్ వర్క్ సాయంతో ఈ ఇంటర్నెట్ సేవలు అందిస్తారు. వీటి ద్వారా తక్కువ లేటెన్సీతో కూడిన ఇంటర్నెట్ సేవలు గ్రామీణ ప్రాంతాల్లోను అందించేందుకు అవకాశం ఉంటుంది. తో పాటు టెలికాం విభాగం నుంచి కూడా అనుమతులు తీసుకోనుంది.

ప్రాజెక్టు కైపర్‌లో భాగంగా 3,236 శాటిలైట్లను అమెజాన్ అంతరిక్షంలోకి పంపించనుంది. 2026 నాటికి సగానికి పైగా ఉపగ్రహాలను పంపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఉపగ్రహాల ద్వారా తక్కువ ధరలో 1జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలు అందించవచ్చు. దీంతో అమెజాన్ ఈ-కామర్స్, ప్రైమ్ వీడియో సేవలను విస్తరించేందుకు దోహదపడుతుంది.