కేంద్రానికి – కేటీఆర్ కు మధ్య ట్విట్టర్ వార్

కేంద్ర సర్కార్ కు టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ కు మధ్య ట్విట్టర్ వార్ నడుస్తుంది. మెడిక‌ల్ కాలేజీల‌పై తెలంగాణ నుంచి ఒక్క ప్ర‌తిపాద‌న కూడా రాలేదని కేంద్రమంత్రి మ‌న్సూఖ్ మాండ‌వీయ అనడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు.

మెడిక‌ల్ కాలేజీల‌పై తెలంగాణ నుంచి ఒక్క ప్ర‌తిపాద‌న కూడా రాలేదని మ‌న్సూఖ్ అన్నారు. స్వ‌ల్ప‌కాలంలో ప్ర‌ధాని మోడీ భారీగా వైద్య క‌ళాశాల‌లు మంజూరు చేశార‌ని.. ప్ర‌తిపాద‌న‌లు పంపిన రాష్ట్రాల‌కు మెడిక‌ల్ కాలేజీలు మంజూరు చేశామ‌ని తెలుపుతూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ విష‌యంపై స్పందించే ముందు కేంద్ర‌మంత్రి స‌మీక్షించే ఉంటారనే భావిస్తున్న‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు. మెడిక‌ల్ కాలేజీల‌పై 2015, 2019లో కేంద్ర వైద్యారోగ్య శాఖ‌కు ప్ర‌తిపాద‌న‌లు పంపామ‌ని గుర్తు చేశారు. తెలంగాణ ప్ర‌భుత్వం ప‌లుమార్లు అడిగినా కూడా ఒక్క వైద్య క‌ళాశాల‌ను కూడా తెలంగాణ‌కు ఇవ్వ‌లేద‌న్నారు. బీబీన‌గ‌ర్ ఎయిమ్స్‌లో ఖాళీగా ఉన్న 544 పోస్టుల భ‌ర్తీలో కేంద్ర ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌న్నారు. బీబీన‌గ‌ర్ ఎయిమ్స్‌ను యూపీఏ ప్ర‌భుత్వం మంజూరు చేసిందని , తెలంగాణ ఒక్క విద్యా సంస్థ‌ను కూడా మీ ప్ర‌భుత్వం మంజూరు చేయ‌లేద‌ని కేటీఆర్ ట్వీట్ చేసారు.