కాన్పుర్‌లో భారీగా హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కేసులు

rise-in-h3n2-influenza-cases-in-kanpur-sparks-concern

కాన్పూర్‌: ప్రస్తుతం దేశవ్యాప్తంగా హఠాత్తుగా పెరుగుతున్న జ్వరం, దగ్గు కేసులకు ‘ఇన్‌ఫ్లూయెంజా ఎ ఉపరకం హెచ్‌3ఎన్‌2’ వైరస్‌ ప్రధాన కారణమని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) గుర్తించిన విషయం తెలిసిందే. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతి ముగ్గురిలో ఒకరు జలుబు, దగ్గు, వైరల్‌ జ్వరాల బారిన పడటం కలవరపెడుతోంది.

ఉత్తర్‌ప్రదేశ్‌ లోని కాన్పూర్‌లో ఈ వైరస్‌ విజృంభిస్తోంది. అక్కడ రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో అత్యవసర వార్డులు కిక్కిరిపోతున్నాయి. తాజాగా కాన్పూర్‌ నగరంలోని హల్లెట్‌ ప్రభుత్వ ఆసుపత్రికి రోగులు క్యూ కట్టారు. జ్వరం, నిరంతరాయంగా దగ్గు, ముక్కు కారడం, శ్వాసకోశ వంటి సమస్యలతో ఒక్క రోజులోనే 200 మంది ఆసుపత్రికి వచ్చారు. వీరిలో 50 మంది రోగులను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. రోగులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతుండటంతో అక్కడి ఎమర్జెన్సీ వార్డులు కిక్కిరిసిపోవడంతో రోగులను ఇతర వార్డులకు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది.

ఈ పరిస్థితిపై ఆసుపత్రిలోని మెడిసిన్‌ డిపార్ట్‌మెంట్‌ అధిపతి రిచా గిరి మాట్లాడుతూ ‘సాధారణంగా ఏటా వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఇలాంటి కేసులు చూస్తుంటాం. కానీ, ఈ సారి పేషేంట్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. వారిలో ఎక్కువ మందిలో జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలున్నాయి. గత 24 గంటల్లో కేవలం శ్వాసకోశ సమస్యలతోనే 24 మంది వైద్యశాలలో చేరారు. వారికి ఆక్సిజన్‌ అందించాల్సిన పరిస్థితి నెలకొంది. కొంతమంది వెంటిలేటర్లపై ఉన్నారు’ అని రిచా గిరి వెల్లడించారు.