సెప్టెంబ‌ర్ 3 న తెలంగాణ మంత్రివ‌ర్గ స‌మావేశం

సెప్టెంబ‌ర్ 3 న తెలంగాణ మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు సమావేశం జరగనుంది. ఈ స‌మావేశంలో అసెంబ్లీ వర్షాకాల స‌మావేశాల తేదీలు ఖ‌రారు, నిర్వహణపై చ‌ర్చించ‌నున్నారు. దీంతో పాటు ప‌లు అంశాల‌పై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. మరోపక్క సీఎం కేసీఆర్ఈ నెల 31 న బీహార్ కు వెళ్లబోతున్నారు. బుధవారం (ఆగస్టు 31) ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పాట్నా వెళ్లనున్న సీఎం కేసీఆర్.. బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌తో భేటీ అవుతారు. ఆయనతో జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. అనంతరం ఇరువురూ కలిసి లంచ్ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

కాగా, చైనాతో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో అమరులైన భారత జవాన్ల కుటుంబ సభ్యులను కూడా సీఎం కేసీఆర్ తన బీహార్ పర్యటనలో కలవనున్నారు. అమర జవాన్లకు గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆర్థికసాయాన్ని ఈ సందర్భంగా వారికి అందించనున్నారు. ఇటీవల సికింద్రాబాద్ టింబర్ డిపోలో ఇటీవల అగ్నిప్రమాదం జరిగి 12 మంది బీహార్ వలస కూలీలు దుర్మరణం పాలయ్యారు. వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించనున్న సీఎం కేసీఆర్… బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో కలిసి ఆర్థిక సాయం చెక్కులు అందిస్తారు.