కార్తికేయ 2 మూవీ ఫై గుజరాత్ సీఎం ప్రశంసలు

నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 మూవీ దేశ వ్యాప్తంగా పలు భాషల్లో దుమ్ముదులుపుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు స్పందించగా..తాజాగా గుజరాత్ సీఎం ప్రశంసలు కురిపించడంతో హీరో నిఖిల్ తో పాటు చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు. యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్‌గా వచ్చిన కార్తికేయ‌ 2 ఎంతటి సంచలన విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. దేశమంతా ఈ సినిమా సంచలనాలు కొనసాగుతున్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించగా ..అనుపమ హీరోయిన్ గా నటించింది.

శ్రీ కృష్ణుడి నేపథ్యంలో వచ్చిన కార్తికేయ 2 సినిమాకు హిందీలోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్ కార్తికేయ 2 సినిమా యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంత మంచి సందేశాన్ని దేశమంతా చూపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని మనస్పూర్తిగా కోరుకున్నారు. హీరో నిఖిల్, నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రత్యేకంగా గుజరాత్ సిఎంను కలిశారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసి ఎపిక్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి..బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తుంది.