మెట్రో రైళ్లల్లో మాదిరిగా బస్సుల్లోనూ సీట్ల అమరికలో మార్పు

tsrtc-makes-changes-to-seating-arrangement-in-buses-to-accommodate-demand

హైదరాబాద్‌ః తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మీ పథకం కారణంగా ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. బస్సులు కిక్కిరిసిపోతుండటంతో కండక్టర్లకు టిక్కెట్లు జారీ చేయడం కూడా కష్టంగా మారింది. దీంతో, ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులో సీట్ల అమరికకు కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టింది. మెట్రో రైళ్లల్లో మాదిరిగా బస్సుల్లోనూ సిట్లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా బస్సు మధ్యలో ఉన్న ఆరు సీట్లను తొలగించి, అదే స్థానంలో బస్సు వాల్స్‌కు సమాంతరంగా సీట్లు ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా కొన్ని రూట్లలో ఆర్టీసీ దీన్ని పరీక్షిస్తోంది.

మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ ప్రయాణానికి విపరీతంగా డిమాండ్ పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఒకప్పుడు రోజుకు 11 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే ప్రస్తుతం ఈ సంఖ్య ఏకంగా 18 – 20 లక్షలకు చేరింది. ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. రద్దీలో బస్సులు ఎక్కలేక, దిగలేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు, కండక్టర్లకు టిక్కెట్ల జారీ కూడా ఇబ్బందిగా మారింది. అయితే, ప్రతి ఒక్కరికీ జీరో టిక్కెట్ జారీ చేయాలన్న నిబంధన అమలవుతుండటంతో కండక్టర్ల ఇక్కట్ల పాలవుతున్నారు. ఈ సమస్యకు తక్షణ పరిష్కారంగా ఆర్టీసీ సీట్ల అమరికలో మార్పునకు సిద్ధమైంది. అధికారుల ప్రకారం, ఆర్టీసీ బస్సుల్లో 44 సీట్లుంటాయి. 63 మంది ప్రయాణిస్తే బస్సు ఆక్యుపెన్సీ రేషియో 100 శాతానికి చేరినట్టు భావిస్తారు.