గ్రూప్-2 పరీక్షను వాయిదా వేసిన TSPSC

జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సి ఉన్న గ్రూప్-2 పరీక్షను వాయిదా వేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కమిషన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నది. ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడిన గ్రూప్‌-2 పరీక్ష తాజాగా మరోసారి వాయిదా పడటంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొన్నది. ఈ క్రమంలో కొత్త పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని టీఎస్‌పీఎస్సీ అధికారులు తెలిపారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌తోపాటు మరో ముగ్గురు సభ్యుల రాజీనామా నేపథ్యంలో పరీక్షపై అభ్యర్థుల్లో అయోమయం నెలకొన్నది.

రాష్ట్రంలో గ్రూప్‌-2 క్యాటగిరీ కింద 18 విభాగాల్లో 783 ఉద్యోగాల భర్తీకి నిరుడు డిసెంబర్‌ 29న నోటిఫికేషన్‌ విడుదల అయింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులను స్వీకరించారు. 5,51,943 మంది దరఖాస్తు చేశారు. సగటున ఒకో ఉద్యోగానికి 705 మంది పోటీ పడుతున్నారు. తొలుత ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్ష నిరహణకు కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకటించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన డిమాండ్‌ మేరకు నవంబరు 2, 3 తేదీలకు పరీక్షను రీషెడ్యూల్‌ చేశారు. నవంబరు 1 నుంచి ఎన్నికల ప్రకియ ప్రారంభంకావడంతో తప్పని పరిస్థితుల్లో రెండోసారి గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేశారు. జనవరి 6, 7 తేదీల్లో కచ్చితంగా పరీక్ష నిర్వహిస్తారని భావించిన అభ్యర్థులు సీరియస్‌గా ప్రిపేర్‌ అయ్యారు. కానీ ఇప్పుడు మరోసారి వాయిదా పడడంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.