జనసేన, టీడీపీ కలిసి వచ్చినా మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే – అంబటి

రాబోయే ఎన్నికల్లో టీడీపీ తో కలిసి బరిలోకి దిగబోతున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన దగ్గరి నుండి వైసీపీ నేతలు పవన్ ఫై విమర్శలు కురిపిస్తూ వస్తున్నారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు మరోసారి పవన్ కళ్యాణ్ ఫై మండిపడ్డారు.

జనసేన, టీడీపీ కలిసి వచ్చినా మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైసీపీనేనని ధీమా వ్యక్తం చేశారు. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబును CID అరెస్టు చేస్తే.. చంద్రబాబు కుటుంబ సభ్యుల కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ గగ్గోలు పెడుతున్నాడని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. టీడీపీతో జనసేన పొత్తు పై జనసేన తీర్మానం చేసిందని.. జనసేన కార్యకర్తలు అర్థం చేసుకోవాలని కోరుతున్నట్లు మంత్రి అంబటి తెలిపారు. నాదెండ్ల మనోహర్ ఐదేళ్ళ నుంచి ఈ తీర్మానం కోసమే ఎదురు చూస్తున్నాడని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ చూస్తే అతను మాట్లాడుతున్న అబద్ధాలు అర్ధం అవుతాయన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఏమవుతుంది.. రెండు అంకెలు కలిస్తే కొత్త అంకె వస్తుందన్నారు. రెండు సున్నాలు కలిస్తే సున్నానే వస్తుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా, వ్యక్తిగతంగా నైతిక విలువలు లేవని.. ఒకరిని పెళ్ళి చేసుకుని మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రాణం తీశాడని.. టీడీపీకి ప్రాణం పోయాలన్న పవన్ ప్రయత్నం ఫలించే అవకాశమే లేదన్నారు.