తెలంగాణ గ్రూప్‌-1 ద‌ర‌ఖాస్తుకు ఈరోజు ఆఖరి గడువు

TSPSC

హైదరాబాద్ః తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్‌సీ) గ‌త నెల‌లో 563 గ్రూప్‌-1 పోస్టుల భ‌ర్తీకి విడుద‌ల చేసిన ఉద్యోగ ప్ర‌క‌ట‌న ద‌ర‌ఖాస్తు గ‌డువు గురువారంతో ముగియ‌నుంది. ఫిబ్ర‌వ‌రి 23 నుంచి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తున్న క‌మిష‌న్‌.. ఈనెల 14 సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు అభ్య‌ర్థుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వీలు క‌ల్పించింది. ఇక గ‌తంలో ద‌ర‌ఖాస్తు చేసిన అభ్య‌ర్థులు కూడా మ‌రోసారి చేయాల‌ని, అలాగే కొత్త‌గా విద్యార్హ‌త పొందిన ఉద్యోగార్థులు పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని క‌మిష‌న్ పేర్కొంది.

కాగా, బుధ‌వారం వ‌ర‌కు 2.70 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన‌ట్లు టీఎస్‌పీఎస్‌సీ వెల్ల‌డించింది. 2022లో జారీ చేసిన గ్రూప్‌-1 నోటిఫికేష‌న్‌కు 3.80 గంట‌ల మంది ద‌ర‌ఖాస్తు చేశారు. గ‌తంలో కూడా ఆఖ‌రి రోజు భారీ సంఖ్య‌లో అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేశారు. అందుకే ఈసారి కూడా అలాగే జ‌ర‌గ‌వ‌చ్చ‌ని టీఎస్‌పీఎస్సీ అంచ‌నా వేస్తోంది. ఇక ద‌ర‌ఖాస్తులో ఏమైనా పొర‌పాట్లు జ‌రిగితే మార్చి 23 ఉద‌యం 10 గంట‌ల నుంచి మార్చి 27వ తేదీ సాయంత్రం ఐదు గంట‌ల వ‌ర‌కు స‌రిచేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. అలాగే జూన్ 9న ప్రిలిమ్స్‌, అక్టోబ‌ర్ 21న మెయిన్స్ నిర్వ‌హించనున్న‌ట్లు ఇప్ప‌టికే ప‌రీక్ష తేదీల‌ను టీఎస్‌పీఎస్సీ ప్ర‌క‌టించింది.