అది సాయి కుమార్ ‘టాప్ గేర్’ టీజర్

హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా ఆది సాయి కుమార్ వరుస సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. తాజాగా ఇప్పుడు టాప్ గేర్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శశికాంత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి శ్రీధర్ రెడ్డి నిర్మాత. ఇక ప్రమోషన్లో భాగంగా ఫస్ట్ లుక్ టీజర్ ను శనివారం విడుదల చేసారు.

గ్రీన్ సిగ్నల్ పడగానే ఎల్లో ట్యాక్సీ వెళుతున్న దృశ్యాలతో ఒక నిమిషం 20 సెకండ్ల నిడివితో టీజర్ మొదలైంది. వెంటనే ఫోన్ రింగ్ కావడం.. ఆది లిఫ్ట్ చేయడంతో …విధి రాతనుంచి విష్ణు మూర్తి కూడా తప్పించుకోలేకపోయాడు అన్నది ఎంత నిజమో.. నా నుంచి నువ్వు తప్పించుకోలేవన్నది కూడా అంతే నిజం.. ఇప్పడు రెండు ప్రాణాలు పోతాయ్..’ అంటూ ఓ వాయిస్ ఆదిని బెదిరించడం.. కార్ ముందుకు సాగుతున్న క్రమంలో వైపర్స్ కదులుతున్న క్రమంలో సినిమాలో వున్న ప్రధాన పాత్రలని చూపించిన తీరు ఆకట్టుకుంటోంది.

ఇక ఈ మూవీ లో ఆదికి జోడిగా రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర లు కీలక పాత్రలలో నటిస్తుండగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబరు 30వ తేదీన విడుదల చేయబోతున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునే కథాకథనాలతో రాబోతున్న ఈ సినిమా పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్, థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను అలరించబోతుందని మేకర్స్ అంటున్నారు.