బీజేపీ నేతలను టార్గెట్ గా టీఆర్ఎస్ ప్రభుత్వం దాడులను ప్రోత్సహిస్తుంది – ఈటెల

టిఆర్ఎస్ ప్రభుత్వంపై హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలను టార్గెట్ గా టీఆర్ఎస్ ప్రభుత్వం దాడులను ప్రోత్సహిస్తుంది అని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం చివరి రోజు ఉద్రికత్త చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పలివెల గ్రామంలో ఈటల రాజేందర్‌ ప్రచారం చేస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పలు వాహనాల అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి.

ఇదే అంశంపై బుధువారం హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. బీజేపీ నేతల టార్గెట్ గా టీఆర్ ఎస్ ప్రభుత్వం దాడులను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గంలోని పలివెలలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రచారాన్ని కొందరు అడ్డుకుంటే రాష్ట్ర పోలీస్‌ వ్యవస్థ ఏం చేస్తోందని రాజేందర్ ప్రశ్నించారు.

పథకం ప్రకారం తన కాన్వాయ్‌పైనా దాడి చేశారని ఈటల రాజేందర్ ఆరోపించారు. పలివెల గ్రామంలో తన సతీమణి ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహిస్తుంటే అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు. రాష్ట్ర మంత్రులు ప్రచారం చేస్తుంటే తాము అడ్డుకున్నామా.. అని నిలదీశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక్కరే బయటకు వెళ్లినా సురక్షితంగా ఇంటికి చేరేవాళ్లమని.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. టీఆర్ ఎస్ మీటింగ్‌ వద్దకు వంద మంది బీజేపీ కార్యకర్తలు వెళితే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. టీఆర్ ఎస్ దౌర్జన్యాలు ఆపకపోతే ప్రజలే ఆ పార్టీని బొందపెడతారన్నారు. తనపై ఈగ వాలినా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఊరుకోదని ఈటల రాజేందర్ హెచ్చరించారు.