ప్రశాంతంగా ముగిసిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా పూర్తియ్యాయి. 60 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 81.10 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ఎన్నికల్లో మొత్తం 259 మంది అభ్యర్థులు బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వచ్చే నెల 2 న కౌటింగ్ చేపట్టనున్నారు. సీఎం డాక్టర్ మాణిక్ సాహా బోర్దావాలిలోని మహారాణి తులసీబటి పాఠశాలలో ఓటు వేయగా.. కేంద్ర సహాయ మంత్రి ప్రతిమా భౌమిక్ ధన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. సీపీఎం అధినేత, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అగర్తలాలో ఓటు వేశారు.

గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి సమయం దాటినా కూడా ఓటు వేసే అవకాశం కల్పించారు. త్రిపురలో సెపాహిజాలా జిల్లాలోని బోక్సానగర్ ప్రాంతంలో, అలాగే గోమతి జిల్లాలోని కక్రాబన్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా హింస చోటు చేసుకుంది. వేర్వేరు హింసాత్మక ఘటనల్లో సీపీఐ నాయకుడు, సీపీఎంకు చెందిన ఇద్దరు పోలింగ్ ఏజెంట్లు సహా పలువురు కార్యకర్తలు గాయపడినట్టు తెలుస్తుంది. మరోవైపు 40-45 చోట్ల ఈవీఎంలు స్తంభించడంతో అన్ని ఈవీఎం మెషీన్లను మార్చి ఓటింగ్ పునఃప్రారంభించినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.

త్రిపురలో ముఖ్యంగా అధికార బీజేపీ-ఐపీఎఫ్టీ కూటమి, సీపీఎం-కాంగ్రెస్ కూటమి మరియు టిప్రా మోతా పార్టీల మధ్యనే కీలక త్రిముఖ పోటీ నెలకుంది. రాష్ట్రంలో మళ్లీ అధికారం దక్కించుకోవడంపై బీజేపీ, ఈసారి అధికారం తమదే అంటూ లెఫ్ట్-కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.