భాస్కర్ రెడ్డి అరెస్ట్ క్రమంలో పులివెందులలో వ్యాపారులు స్వచ్చంద బంద్

వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డిని సీబీఐ (CBI) అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. భాస్కర్‌రెడ్డి ఉంటున్న పులివెందులలోని ఇంటికి ఆదివారం తెల్లవారు జామున సీబీఐ అధికారులు వెళ్లారు. అక్కడ ఆయన్ను విచారించిన తర్వాత కడపకు తీసుకెళ్లారు. భాస్కర్ రెడ్డి అరెస్ట్ విషయాన్ని ముందుగా కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అరెస్ట్ మెమోను భాస్కర్ రెడ్డి భార్య లక్ష్మీకి అందజేశారు సీబీఐ అధికారులు. భాస్కర్ రెడ్డిపై సెక్షన్ 120B, రెడ్ విత్ 302, 201 కేసులు నమోదు చేశారు.

ఇక భాస్కర్ రెడ్డి అరెస్ట్‌తో పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టణంలో పోలీసులు ఎక్కడికక్కడ భారీగా మోహరించారు. భాస్కర్ రెడ్డి అరెస్ట్ క్రమంలో పులివెందులలో వ్యాపారులు స్వచ్చంద బంద్ పాటిస్తున్నారు. భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై వైస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పులివెందులలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. శాంతియుతంగా నిరసనలు చేపడుతున్నారు. దీంతో పులివెందులలో కాస్త టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు.