ప్రతిపక్ష నేతలు కేసీఆర్ కు దొంగల్లా కనిపిస్తున్నారా?

పరామర్శించడం ఏమైనా నేరమా?: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి సీఎం కెసిఆర్ పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆత్మ‌హ‌త్య చేసుకున్న కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించడానికి వెళ్తున్న నేత‌ల‌ను కూడా అరెస్టు చేయ‌డం ఏంట‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ‘317 జీవో కారణంగా మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న బీంగల్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సరస్వతి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి కారును పోలీసులు ఛేజ్ చేసి.. కమ్మర్ పల్లి వద్ద అడ్డుకుని, ఆయనను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

‘ప్రజా సమస్యలపై స్పందించే ప్రతిపక్ష నేతలు కేసీఆర్ కు దొంగల్లా కనిపిస్తున్నారా? బాధిత కుటుంబాలను పరామర్శించడం ఏమైనా నేరమా? ప్రతిపక్ష నేతలు ప్రభుత్వ తప్పులను ప్రశ్నించడం ప్రజలు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కేసీఆర్ దుర్మార్గ పాలన హద్దులు మీరుతోంది. మూల్యం తప్పక చెల్లించుకుంటారు’ అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇదిలావుంచితే, నిజామాబాద్ జిల్లాలోని భీమ్‌గల్ మండలం బాబాపూర్‌‌లో ఆత్మహత్య చేసుకున్న సరస్వతి అంత్యక్రియలకు బీజేపీ, కాంగ్రెస్ నేతలు హాజరుకానున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఆ జిల్లా వ్యాప్తంగా ప‌లువురు నేత‌ల‌ను హౌస్ అరెస్ట్ చేశారు. టీచ‌ర్ సరస్వతి అంత్యక్రియలు జరిగే బాబాపూర్ గ్రామంలో ప్రత్యేక పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/