రామోజీరావు మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల స్పందన

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. రామోజీరావు మరణ వార్త తెలిసి అంత దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రముఖులు సైతం రామోజీ రావు మృతి పట్ల తమ స్పందనను తెలియజేస్తూ వస్తున్నారు. ‘ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగింది. ఓం శాంతి’ అంటూ ఎక్స్​ వేదికగా మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు.

నూటికో కోటికో ఒక్కరే ఉంటారు : తారక్

రామోజీ రావు మృతిపై హీరో జూనియర్ ఎన్​టీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒక్కేరే ఉంటారు అంటూ వ్యాఖ్యానించారు. “శ్రీ రామోజీ రావు గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత, భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

రామోజీరావు అస్తమయంపై సినీ నటి ఖుష్బూ సంతాపం వ్యక్తం చేశారు. సినీరంగం లెజెండ్‌ను కోల్పోయిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు ట్విట్​ చేశారు.

చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలు సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి – కల్యాణ్‌రామ్‌

“రామోజీరావు భారతీయ మీడియా, చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలు చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి”.

రామోజీగారికి భారతరత్న ఇవ్వడమే ఘనమైన నివాళి – రాజమౌళి

“తన కృషితో లక్షలాది మందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి రామోజీరావు. 50 సంవత్సరాల నుంచి ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తున్నారు. ‘భారతరత్న’తో ఆయనను సత్కరించడమే మనమిచ్చే ఘనమైన నివాళి”.

రామోజీరావు మృతిపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంతాపం వ్యక్తం చేశారు. ‘అక్షర యోధులు, వివిధ రంగాలలో అద్భుతమైన విజయాలు సాధించారు. భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచి విశిష్టమైన వ్యక్తిగా నిలిచారు. రామోజీ రావు మరణం అత్యంత విషాదకరం. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అని’ వైఎస్ షర్మిల సంతాపం తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రామోజీరావు వైఎస్ఆర్ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.

రామోజీ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. తెలుగు పాత్రికేయానికి రామోజీరావు విశ్వసనీయత జోడించారని తెలిపారు. తెలుగు పారిశ్రామికరంగానికి రామోజీ విలువలు జోడించారని తెలిపారు. మీడియా రంగంలో రామోజీరావు లేని లోటు పూడ్చలేనిదన్నారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నామన్నారు. రామోజీరావు కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రామోజీరావు మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. తెలుగు జర్నలిజాన్ని ఓ మలుపు తిప్పిన ఘనత రామోజీరావుకి దక్కుతుందన్నారు. పత్రికను మారుమూల గ్రామాలకు సైతం చేర్చి స్థానిక వార్తలకు ప్రాధాన్యం కల్పించారని కొనియాడారు. ప్రత్యేకంగా తెలుగు భాష అభివృద్ధికి జర్నలిజం ద్వారా కృషి చేశారన్నారు.