రామోజీరావు మృతి పట్ల ప్రధాని మోడీఎం పవన్ కళ్యాణ్ లు దిగ్బ్రాంతి

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు (88) దివికేగారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈయన మరణం పట్ల రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

రామోజీరావు అస్తమయంపై ప్రధాని మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. “మీడియాలో రామోజీ సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు. రామోజీరావు ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారు. ఆయనతో మాట్లాడే అవకాశం నాకు ఎన్నోసార్లు దక్కింది. రామోజీరావు నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. రామోజీరావు అసంఖ్యాక అభిమానులకు నా సానుభూతి” అని మోదీ పోస్ట్ చేశారు.

పవన్ కళ్యాణ్ : బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీ రావు లేరనే వార్త ఆవేదన కలిగించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారన్నారు. అక్షరయోధుడు రామోజీ రావు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక.. కోలుకొంటారని భావించానని పవన్ తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు.