కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు టీఎమ్‌సీ మద్దతు: మమత

TMC supports formation of India coalition government at centre: Mamata

కోల్‌కతాః కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు బయటి నుంచి మద్దతు ఇస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి టీఎమ్‌సీ అధినేత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇండియా కూటమితో పొత్తు ఉండదని గతవారమే స్పష్టం చేసిన మమత తాజాగా తన వైఖరిపై మరింత స్పష్టత నిచ్చారు. ‘‘పశ్చిమ బెంగాల్‌లో ఇండియా కూటమి లేదు. అసలు ఈ కూటమి ఏర్పాటులో నేను కీలక పాత్ర పోషించా. కూటమి పేరును కూడా నేనే సూచించా. కానీ రాష్ట్రంలో మాత్రం సీపీఐ (ఎమ్), కాంగ్రెస్.. బీజేపీ కోసం పనిచేస్తున్నాయి’’ అని గత వారం మమత సంచలన కామెంట్స్ చేశారు. నాటి కామెంట్స్‌పై బుధవారం మమత స్పష్టత నిచ్చారు. ‘‘సీపీఐ (ఎమ్), కాంగ్రెస్‌పై ఆధారపడొద్దు. వారు మనతో లేరు, బీజేపీ వెంట ఉన్నారు’’ అని పేర్కొన్నారు.

బీజేపీపై మమతా బెనర్జీ నిప్పులు చెరుగుతూ, కమలం పార్టీ దొంగలతో నిండిపోయిందని అన్నారు. 400 పైచిలుకు సీట్లు సాధించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడంలో బీజేపీ విఫలమవుతుందని అన్నారు. ‘‘400 సీట్లు గెలుచుకుంటామని బీజేపీ అంటోంది. కానీ ప్రజలు మాత్రం అది కుదరదని చెబుతున్నారు. బీజేపీలో దొంగలు ఉన్నారని యావత్ దేశానికి అర్థమైంది. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు బయట నుంచి మేము మద్దతు ఇస్తాము. రాష్ట్రంలో మా తల్లులు, సోదరీమణులు, 100 డేస్ జాబ్ స్కీమ్‌లో పనిచేసేవారు ఇబ్బంది పడకుండా కేంద్రంలో ఇండియా కూటమికి మద్దతు ఇస్తాము’’ అని ఆమె పేర్కొన్నారు. సీఏఏను రీఅప్పీల్ చేస్తామని, ఎన్‌ఆర్‌సీ, యూనిఫాం సివిల్ కోడ్ అమలు కాకుండా చూస్తామని స్పష్టం చేశారు.