ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కి షాక్ ఇచ్చిన జగన్

ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి వైసీపీ అధినేత జగన్ బిగ్ షాక్ ఇచ్చారు. జంగా ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని శాసనమండలి చైర్మన్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. జంగా పార్టీ ఫిరాయింపు కారణంగా.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని వైసీపీ కోరింది. ఈ మేరకు వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేసిన శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేనురాజు.. ఎమ్మెల్సీ కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం అర్ధరాత్రి గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేశారు. శాసనమండలిలో జంగా కృష్ణమూర్తి విప్‌గా ఉన్నారు.

జంగా కృష్ణమూర్తి 2009 నుంచి 2019 మధ్య కాలంలో పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత ఆయన్ని వైసీపీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసింది. వైసీపీలో ఉన్న సమయంలో విప్ గానూ జంగా పనిచేశారు. అయితే, ఎన్నికల ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఏప్రిల్ 1న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఏప్రిల్ 6న పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువాను కప్పుకున్నారు.