చీమలపాడులో మరో విషాదం..

రీసెంట్ గా ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఒక గుడిసెలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో నలుగురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం వల్ల మనుషుల ప్రాణాలే కాదు మూగజీవాల ప్రాణాలు సైతం పోయాయి. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం రద్దు కావడం తో కార్యకర్తలకు వండిన వంటలు గ్రామ సమీపంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలు పారబోశారు. పారేవేసిన వంటలను తిన్న మూడు ఆవులు మృత్యువాత పడ్డాయి. ఒక ఆవుకి పశు వైద్యుడు వైద్యం చేస్తున్నాడు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కోసం తయారుచేసిన వంటలనే తిని మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఈ ఘటనపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళన పేరుతో కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. బుధువారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు వద్ద నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు, వైరా ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ క్రమంలో నేతలను ఆహ్వానిస్తూ బిఆర్ఎస్ కార్యకర్తలు బాణాసంచా పేల్చారు. దీంతో ఆ నిప్పురవ్వలు ఎగిరిపడి సభా ప్రాంగణానికి 200 మీటర్ల దూరంలో ఉన్న గుడిసెపై పడ్డాయి. దీంతో గుడిసెలో ఉన్న గ్యాస్ సిలిండర్‌కు మంటలు అంటుకుని అది పేలిపోయింది. దీంతో అక్కడ ఉన్న వారంతా ప్రమాదానికి గురయ్యారు. ఘటనా స్థలంలో రమేశ్, మంగు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు.