తిరుమల ఘాట్‌ రోడ్డులో ఏనుగుల గుంపు హల్‌ చల్‌

తిరుమల ఘాట్‌ రోడ్డులో మరోసారి ఏనుగుల గుంపు హల్‌ చల్‌ చేసి భక్తులను భయబ్రాంతులకు గురిచేశాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఏనుగుల గుంపు నిల్చుని అటుగా వచ్చే భక్తులను భయాందోళనకు గురి చేసాయి. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆ గుంపులో ఐదు ఏనుగులు, ఒక గున్న ఏనుగు ఉన్నాయి. సమాచారం అందుకున్న ఫారెస్ట్‌ అధికారులు.. ఏనుగుల గుంపును తిరిగి అడవిలోని పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏనుగుల గుంపును రోడ్డుపైకి రానివ్వకుండా చర్యలు తీసుకుంటూ దగ్గరుండి వాహనదారులను ఘాట్ రోడ్డులో అనుమతిస్తున్నారు.. వేసవి కాలం కావడంతో నీటిని వెతుకుతూ ఏనుగుల గుంపు శేషాచలం అటవీ ప్రాంతంను వదిలి బయటకు వచ్చినట్లు టిటిడి అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు.

కాగా కొన్ని రోజులుగా శేషాచలం అడవుల్లోని ఏనుగులు చుట్టుపక్కల గ్రామాల్లోకి ప్రవేశిస్తూ హల్చల్‌ చేస్తున్నాయి. పంట పొలాలపై పడి బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇక వేసవిలో తిరుమలలో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే ఇదేసమయంలోనే.. అటు తిరుమల ఏడుకొండలకు ఆనుకొని ఉన్న శేషాచలం అడవుల్లో వన్య ప్రాణులు కూడా రోడ్లపైకి వస్తుంటాయి. తిరుమల భక్తులు వెళ్లే రహదారులకు సమీపంలో ఏనుగులు, చిరుత పులులు హల్ చల్ చేస్తుంటాయి.