లోటస్‌పాండ్ చెరువులో భారీగా చేపల మృతి..

లోటస్‌పాండ్ చెరువులో భారీగా చేపల మృతి చెందడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. గడిచిన నాలుగు రోజులుగా చేపలు చనిపోతూ వస్తున్నాయి. చనిపోయిన చేపలు కుప్పలు కుప్పలుగా ఒడ్డుకు చేరుతున్నాయి. నిత్యం పార్కులో వాకింగ్‌కు వచ్చే వాకర్లు వాటిని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పిసిబి అధికారులు.. ఫిషరీస్ అధికారులు… ఈ సంఘటనపై ఆరా తీస్తున్నారు.

మురుగు నీరు చెరువులోకి చేరటం వల్లే చేపలు చనిపోతున్నాయని కొందరు అంటుండగా.., విష ప్రయోగం జరిగి ఉంటుందని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా చెరువులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. ఆ నీటితో పాటు వర్షం కారణంగా సెల్లార్లలో నిండిన నీరును బయటకు పంపింగ్ చేయటం ద్వారా వచ్చిన నీరు కూడా చెరువులోకి చేరుతుంది.

చెరువు చుట్టూ నిర్మాణాలు జరుగుతున్నాయని… బిల్డర్లు బ్లాస్టింగ్‌లో వినియోగించే కెమికల్‌ వ్యర్థాలు చెరువులోకి చేరి ఉంటుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన ఆ కెమికల్ వ్యర్థాల వల్లే చేపలు చనిపోయి ఉంటాయని అంటున్నారు. చేపలు చనిపోతున్న విషయాన్ని స్థానికులు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుతో పాటు ఎన్విరాన్‌మెంట్ అధికారులు, బయోడైవర్సిటీ, GHMC, జలమండలి అధికారులకు కంఫ్లైంట్ చేశారు. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు చెరువు వద్దకు చేరుకొని నీటి శాంపిల్స్ సేకరించారు.