ప్రముఖ గాయకుడు జె. ఏసుదాసు కొడుకు ఇంట్లో భారీ దొంగతనం

ఈ మధ్య సినీ ప్రముఖుల ఇళ్లలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఇంట్లో ఎంతో నమ్మకంగా పనిచేస్తూ వస్తున్న పనివారే దొంగతనాలు చేస్తున్నారు. రీసెంట్ గా పది రోజుల క్రితం ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో దొంగతనం జరిగిన సంగతి తెలిసిందే. చెన్నైలోని తన ఇంట్లో నుంచి 48 తులాల బంగారం, వజ్రాభరణాల జ్యుయలరీ చోరీకి గురికాగా..అవన్నీ వారి ఇంట్లో పనిచేసే ఈశ్వరి అనే మహిళా దొంగతనం చేసింది. అంతే కాదు ధనుష్ ఇంట్లో కూడా పెద్ద ఎత్తున దొంగతనాలు చేసినట్లు తేలింది.

ఈ ఘటన గురించి ఇంకా చిత్రసీమలో మాట్లాడుకుంటుండగానే ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు జె. ఏసుదాసు కుమారుడు విజయ్‌ నివాస గృహంలో 60 సవర్ల బంగారు నగలు, వజ్రాభరణాలు చోరీ అయ్యాయి. ఈ మేరకు విజయ్‌ జేసుదాసు భార్య అభిరామపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ నగలను తమ ఇంట పనిచేసే వారే చోరీ చేసి వుంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించి విజయ్‌ జేసుదాసు నివాసగృహంలో ఇప్పటి వరకూ పనిచేసినవారి వివరాలను సేకరిస్తున్నారు.