రెండో జాబితా విడుదల చేసిన టిడిపి

The second list was released by TDP

అమరావతిః టిడిపి 34 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసింది. రాజమండ్రి రూరల్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దక్కించుకోగా, గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేసిన గాజువాకలో ఈసారి టిడిపి అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు టికెట్ దక్కించుకున్నారు. దెందులూరు నుంచి మరోసారి చింతమనేని ప్రభాకర్ కే అవకాశం ఇచ్చారు.

గురజాల నుంచి యరపతినేని శ్రీనివాసరావు బరిలో దిగుతుండగా, వైఎస్‌ఆర్‌సిపి నుంచి టిడిపి వైపునకు మరలిన ఆనం రామనారాయణరెడ్డిని ఆత్మకూరు అభ్యర్థిగా ప్రకటించారు.

ఇక, ప్రకాశం జిల్లాలో గత కొంతకాలంగా కాంగ్రెస్ కు, ఆ తర్వాత వైఎస్‌ఆర్‌సిపికి కంచుకోటగా మారిన కందుకూరు నియోజకవర్గం నుంచి ఇంటూరి నాగేశ్వరరావు ఎన్నికల అరంగేట్రం చేస్తున్నారు.

మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా చల్లా రామచంద్రారెడ్డి (బాబు) టికెట్ దక్కించుకున్నారు.

రెండో జాబితాలో 34 మంది పేర్లను ప్రకటించగా, అందులో 27 మంది పురుషులు, ఏడుగురు మహిళలు. అందులో పదో తరగతి, అంతకంటే తక్కువ చదివినవాళ్లు ఐదుగురు ఉన్నారు. ఒకరు పీహెచ్ డీ, 11 మంది పీజీ, 9 మంది గ్రాడ్యుయేషన్, 8 మంది ఇంటర్ చదివిన వారు ఉన్నారు.

ఇక, వయసు చూస్తే… 61 నుంచి 75 ఏళ్ల మధ్య వయసున్న వారు ముగ్గురు ఉండగా… అత్యధికంగా 46 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వారు 19 మంది ఉన్నారు.

తొలి జాబితాలో టిడిపి 94 మంది పేర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండో జాబితాతో కూడా కలిపి ఇప్పటివరకు 128 మందిని ప్రకటించినట్టయింది. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు… బిజెపికి 10 అసెంబ్లీ స్థానాలు 6 ఎంపీ స్థానాలు కేటాయించారు.