వ్యవస్థల విధ్వంసం అంటే ఇది కాదా?: చంద్రబాబు

పురుటి నొప్పులతో వచ్చిన మహిళను ఆసుపత్రిలో చేర్చుకోకపోవడం దారుణమన్న బాబు

Chandrababu Tour Program in Kuppam
tdp-chief-chandrababu

అమరావతిః తిరుపతిలో నడిరోడ్డుపై మహిళ ప్రసవించిన ఘటన గుండెను కలచివేస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. తోడుగా సహాయకులు కూడా లేకుండా పురుటి నొప్పులతో వచ్చిన మహిళలను ప్రసూతి ఆసుపత్రి సిబ్బంది చేర్చుకోకపోవడం దారుణమని చెప్పారు. స్థానికులు దుప్పట్లను అడ్డుపెట్టి ప్రసవం చేయించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఇలాంటి దుస్థితిపై ఎలా చెపితే ఈ ప్రభుత్వానికి అర్థమవుతుందని అడిగారు. వ్యవస్థల విధ్యంసం అంటే ఇది కాదా? అని ప్రశ్నించారు.

మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పర్యటనకు ముఖ్యమంత్రి జగన్ వస్తున్న నేపథ్యంలో రోడ్డు పక్క ఉన్న పెద్ద చెట్లను అధికారులు నరికి వేయడంపై కూడా చంద్రబాబు మండిపడ్డారు. సాధారణంగా ప్రజాప్రతినిధులు తమ పర్యటనల్లో మొక్కలు నాటడం ఇన్నాళ్లు చూశామని… కానీ సీఎం వస్తున్నారని భారీ వృక్షాలను, అది కూడా ఏ మాత్రం అడ్డుగాలేని చెట్లను నరికి వేయడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామని విమర్శించారు. మొక్కలు నాటాల్సిన పాలకులు… చెట్లను నరికెయ్యమని సందేశం పంపుతున్నారా? అని ప్రశ్నించారు. ఇదే కాదా రివర్స్ పాలన అంటే అని దుయ్యబట్టారు. ‘నువ్వు జగన్ రెడ్డి కాదు… రివర్స్ రెడ్డి’ అని ఎద్దేవా చేశారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/