అమెరికాలో కాల్పుల ఘటనపై జో బైడెన్ తీవ్ర ఆవేదన

తుపాకీ సంస్కృతి ఎప్పుడు అంతమవుతుందని ఆవేదన

వాషింగ్టన్: అమెరికాలోని టెక్సాస్ స్కూల్ లో కాల్పుల ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు రోజుల ఆసియా పర్యటనను ముగించుకుని శ్వేత సౌధానికి చేరిన కాసేపటికే ఆయన కాల్పుల ఘటనపై స్పందించారు. ‘‘ఆ దేవుడి దయతో దేశంలో తుపాకీ సంస్కృతి ఎప్పుడు అంతమవుతుందో! మనం గన్ లాబీకి వ్యతిరేకంగా ఎప్పుడు పోరాడుతామో!’’ అని ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలు కలచి వేస్తున్నాయని, వాటిని చూసి చూసి అలసిపోయానని అన్నారు. ఇకనైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలో ఇలాంటి ఘటనలు జరగడం అరుదని, అమెరికాలో మాత్రం ఎందుకు తరచూ జరుగుతున్నాయోనని బైడెన్ విచారం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం వరకు జెండాలను అవనతం చేయాలని పిలుపునిచ్చారు.

కాగా, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా స్పందించారు. మామూలుగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు గుండెలు తరుక్కుపోతున్నాయంటారని, కానీ, ప్రతిసారీ తమ గుండెలు తరుక్కుపోతూనే ఉన్నాయని ఆమె అన్నారు. పగిలిన బాధిత కుటుంబాల గుండెలతో పోలిస్తే.. తరుక్కుపోయిన మన గుండెల బాధ తక్కువేనన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవడానికి ధైర్యం కావాలన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/