పాల ధరలు మళ్లీ పెరిగాయ్

ప్రస్తుత కాలంలో సామాన్య ప్రజలు బ్రతకాలంటే ఎంతో కష్టం అవుతుంది. వచ్చే ఆదాయానికి మించిన ఖర్చులు అవుతున్నాయి. మార్కెట్ లో ఏదో కొనాలన్నా ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. గ్యాస్ , పెట్రోల్ , కూరగాయలు ఇలా ఏది కూడా భారీగా ధరలు పలుకుతున్నాయి. ఇక ఇవే కాదు పాల పాకెట్ ధర కూడా భారీగా పెరుగుతున్నాయి. దీంతో పాల పాకెట్ కొనాలంటే సామాన్య ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికే పలు సంస్థల పాల పాకెట్ ధరలు భారీగా పెరుగగా..తాజాగా మదర్ డెయిరీ పాల ధరను అమాంతం పెంచేసింది.

లీటర్ ఫుల్ క్రీమ్ పాల ధర రూ.63 నుంచి రూ.64కు పెరిగింది. పెరిగిన ధరలు నవంబర్ 21నుంచి అమల్లోకి వస్తాయని మదర్ డెయిరీ ముందే ప్రకటించింది. దీంతో ఈ ధరలు ఈ రోజు నుంచి అందుబాటులోకి రానున్నాయి. ప‌శుగ్రాసం, దాణా వంటి ఉత్పత్తుల ధరలు పెరిగిపోవడంతో తప్పనిసరిగా ధరలు పెంచాల్సి వచ్చిందని మదర్‌ డెయిరీ ప్రతినిధులు తెలిపారు. ఈ సంవత్సరం మ‌ద‌ర్ డెయిరీ పాల ధ‌ర‌లు పెంచ‌డం ఇది నాలుగోసారి. మదర్‌ డెయిరీ ఢిల్లీ – ఎన్సీఆర్ ప‌రిధిలో ప్రతి రోజూ 30 ల‌క్షల లీట‌ర్లకు పైగా పాల‌ను స‌ర‌ఫ‌రా చేస్తుంది. ఇలా పాల ధరలు పెరగడంతో సామాన్యుడికి టీ తాగడం భారంగా మారుతోంది. ఒకప్పుడు ఇరవై, ముప్పై రూపాయల్లోపు వచ్చే పాలు.. ఇప్పుడు రెట్టింపు ధరలయ్యాయి. కాగా, ఇప్పటికే విజయ, ఆమూల్, హెరిటేజ్ పాల ధరలను పెంచగా, ఇప్పుడు మదర్ డెయిరీ కూడా అదే బాటలో నడుస్తోంది.