రాజగోపాల్ రెడ్డిని ఓడించిన మునుగోడు ప్రజలకు కృతజ్ఞతలు – సీపీఐ, సీపీఎం

మునుగోడు ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ఓడించినందుకు మునుగోడు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలు. రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయి.. కమ్యూనిస్టులు అమ్ముడు పోయారంటూ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని సీపీఐ, సీపీఎం పార్టీల నల్లగొండ జిల్లా కార్యదర్శులు నెల్లికంటి సత్యం, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి లు అన్నారు. రాజకీయ భిక్షపెట్టిన కాంగ్రెస్‌ను వదిలి, కాసుల కోసం కాషాయం కండువా కప్పుకున్న రాజగోపాల్‌రెడ్డికి కమ్యూనిస్టుల గురించి మాట్లాడే నైతిక హక్కే లేదన్నారు.

2018లో తాము రాజగోపాల్‌రెడ్డికి మద్దతిచ్చి గెలిపించినా రాజకీయంగా ఎక్కడా కలుపుకుపోలేదని విమర్శించారు. రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎన్నడూ ప్రయత్నం చెయ్యలేదని ఆరోపించారు. దేశంలో రైతు, కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న బీజేపీలో చేరి ఆ పార్టీ కుట్రలో భాగం పంచుకున్నందుకే తాము టీఆర్‌ఎస్‌ను బలపర్చి రాజగోపాల్‌ను ఓడించామని సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు సత్యం, సుధాకర్ రెడ్డిలు పేర్కొన్నారు.

బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 11 ,666 ఓట్ల తేడాతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. తొలి రౌండ్ నుంచి నువ్వా నేనా అన్నట్లు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య నడిచింది. దాదాపు 10 రౌండ్ల వరకు స్వల్ప మెజార్టీతో కనిపించిన కారు పార్టీ..11వ రౌండ్ నుంచి స్పష్టమైన మెజార్టీ ప్రదర్శించింది. రెండు, మూడు, 15వ రౌండ్లలో మాత్రమే కమలం పార్టీ ముందంజలో నిలిచింది. మిగతా అన్ని రౌండ్లలో కారు దూసుకుపోయింది. ఫలితంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీ విక్టరీ కొట్టింది.