ఏపిలో ఈ నెల 20 నుంచి ‘జగనన్నే మా భవిష్యత్తు’ ప్రచారం

ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పథకాలపై అవగాహన

CM Jagan

అమరావతిః ఏపిలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, చేపట్టిన అభివృద్ధి పనులను ఇంటింటికీ తీసుకెళ్లేందుకు అధికార పార్టీ ప్రచార కార్యక్రమం చేపడుతోంది. ఈ నెల 20 నుంచి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ‘జగనన్నే మా భవిష్యత్తు’ పేరుతో ప్రచారం చేపట్టనున్నట్లు వైఎస్‌ఆర్‌సిపి నేతలు వెల్లడించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, వాటి అమలును ఈ కార్యక్రమంలో ప్రజల ముందుకు తీసుకెళతామని వివరించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి సోమవారం మధ్యాహ్నం ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, పరిశీలకులతో ముఖ్యమంత్రి జగన్ సమావేశం కానున్నారు.

ఈ నెల 20 నుంచి 27 వరకు 175 నియోజకవర్గాల్లోని 15 వేల సచివాలయాల్లో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం జరుగుతుందని వైఎస్‌ఆర్‌సిపి నేతలు చెప్పారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు తమ నియోజకవర్గంలో రోజూ 25 నుంచి 30 ఇండ్లకు తిరిగి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తారని తెలిపారు. వాలంటీర్లతో కలిసి గృహ సారథులు ఇళ్లను సందర్శిస్తారని పేర్కొన్నారు. సచివాలయం కన్వీనర్లతో పాటు గ్రామ, వార్డు వాలంటీర్లు అందరూ ఈ ప్రచార కార్యక్రమంలో పాలుపంచుకుంటారని వివరించారు.