జల్లేరు వాగు బస్సు ప్రమాదం : మృతుల కుటుంబాలకు ఆర్టీసీ రూ.2.50 లక్షల పరిహారం

బుధువారం ప.గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో వాగులో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా..25 మందికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం పట్ల ప్రధాని మోడీ , జగన్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు పీఎం సహాయనిధి నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, సీఎం రిలీఫ్ ఫండ్ నుండి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించగా..ఆర్టీసీ సైతం రూ.2.50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.

ఘటన స్థలాన్ని కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మల్లికార్జునరెడ్డితో కలిసి పరిశీలించారు. ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ చేయిస్తామన్నారు. బస్సులో ఎటువంటి లోపాలు లేవని స్పష్టం చేశారు. ప్రతిరోజూ అన్ని బస్సులనూ తనిఖీ చేస్తారని.. ఏమైనా లోపాలు ఉంటే మరమ్మతులు చేపడుతారని తెలిపారు. బస్సు స్టీరింగ్ పట్టేయడం వల్లే ప్రమాదం జరిగింది అనేది పూర్తిగా అవాస్తవమ‌న్నారు. బస్సు.. 3 లక్షల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందని, ఇంకా కాలపరిమితి ఉందని పేర్కొన్నారు.

ప్రమాదం ఎలా జరిగిందనేది చూస్తే..వేలేరుపాడు నుంచి భద్రాచలం మీదుగా జంగారెడ్డిగూడెం వస్తున్న ఆర్టీసీ బస్సులో 49 మంది ప్రయాణికులున్నారు. ఉదయం 11.45 గంటలకు బస్సు గమ్య స్థానానికి చేరుకోవాల్సి ఉండగా 12.00 గంటలకు ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో అక్కడికక్కడే 9 మంది చనిపోగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు.

మృతుల్లో ఏడుగురు మహిళలు, ముగ్గురు పురుషులున్నారు. ఆడమిల్లి జాన్‌మోజెస్‌ (52), ఎం.లక్ష్మి(40), పొడపాటి దుర్గమ్మ(55), ఉండ్రాజవరపు సరోజిని (56), బడుగు సత్యవతి(58), శ్రీరాముల బుల్లెమ్మ(45), కేతా వరలక్ష్మి(62), బస్సు డ్రైవర్‌ సాలుమూరి చిన్నారావు(46), పాలడుగుల మహాలక్ష్మి(45), తూర్పుగోదావరి జిల్లా కడియానికి చెందిన సోమరాజు(55) మృతుల్లో ఉన్నారు.