బిజెపి లోకి బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ ..?

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిఆర్ఎస్ పార్టీ కి వరుస షాకులు తప్పడం లేదు. ఇప్పటికే పెద్ద ఎత్తున నేతలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరగా..ఇప్పుడు ఉన్న కొద్దీ మంది నేతలు పార్టీ ని వీడుతుండడం అధినేతను కలవరపెడుతుంది. తాజాగా మాజీ ఎమ్మెల్సీ..బిజెపి గూటికి చేరేందుకు సిద్దమయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పరిచయం అవసరం లేని నాయకుడు తేరా చిన్నపరెడ్డి. ఆయన కమలం గూటికి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసుకుస్తున్నట్లు తెలిసింది. తేరా 2009వ సంవత్సరానికి ముందు టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009 శాసనసభ ఎన్నికలలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నుంచి పోటీ చేసి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డి చేతిలో ఓటమి చెందారు.

ఆ తర్వాత 2014లో నల్గొండ పార్లమెంటు సభ్యుడిగా టీడీపీ నుంచి పోటీచేసి ప్రస్తుతం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. అదే క్రమంలో 2015లో నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రస్తుత మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో చిన్నపరెడ్డి విజయం సాధించి 2019 జూన్‌లో శాసనమండలి అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఇదిలా ఉంటే గత కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు చిన్నపరెడ్డితో పలు దఫాలుగా మాట్లాడినట్లు సమాచారం. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఎలాగైనా నల్గొండ పార్లమెంట్‌ని గెలవాలని పార్టీ పట్టుదలతో ఉంది. దానికోసం అన్ని రకాలుగా అర్హత కలిగిన చిన్నపరెడ్డిని పార్టీలో చేర్చుకొని పోటీ చేయించాలని నేతలు భావిస్తునట్లు సమాచారం. చర్చలు పూర్తిగా జాతీయ నాయకుడి కనుసన్నంలోనే జరుపుతున్నట్లు సమాచారం. అయితే తేరా చిన్నపరెడ్డి కూడా పార్టీ మారేందుకు ఆసక్తి చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.