తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల పాటు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్

ఫిష్ ప్రియులకు గుడ్ న్యూస్. తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల పాటు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నారు. మృగశిర కార్తె సందర్భంగా వచ్చే నెల 8, 9, 10వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ‘ఫిష్ ఫుడ్ ఫెస్టివల్’ను నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణ, ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో మంత్రి తలసాని బుధవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.అన్ని జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉండాల్సిన చేప ఉత్పత్తులు, వంటకాలపై విస్తృతంగా చర్చించారు. ఫెస్టివల్ నిర్వహణకు అనువైన ప్రాంతాలు గుర్తించి ఏర్పాట్లు చేయాలని అధికారులను తలసాని ఆదేశించారు.

ఈ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ లో చేపలతో తయారు చేసిన ఫిష్ ఫ్రై, కర్రీ, బిర్యానీవంటి అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర పండుగను తలపించే విధంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని, ఇందుకోసం పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ అధికారులతో పాటు గోపాలమిత్ర లకు కూడా భాగస్వాములను చేయాలన్నారు మంత్రి తలసాని. అంతేగాక, మత్స్యరంగానికి విశేష సేవలు అందించిన వారిని గుర్తించి సన్మానించాలని తెలిపారు. మృగశిర కార్తీక మాసం ప్రారంభం రోజున ఈ ఫిష్​ ఫుడ్​ ఫెస్టివల్​ను ప్రారంభించనున్నట్లుగా మంత్రి తెలిపారు.