తెలంగాణ మరో విషయంలో నెంబర్వన్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో మరో గుర్తింపు సంపాదించుకుంది. మొక్కల పెంపకంలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని అటవీ, న్యాయ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. మొక్కల పెంపకంలో తెలంగాణ తొలి స్థానంలో నిలిచిందని కేంద్ర అటవీ శాఖ గణాంకాలు వెల్లడించడంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. మొక్కల పంపకం, అటవీ పునరుజ్జీవనం, అటవీ రక్షణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అటవీ రక్షణ చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. ఆకుపచ్చ తెలంగాణ సాధన లక్ష్యానికి చేరువలో ఉన్నామని, అధికారులు, సిబ్బంది మరింత కష్టపడి ఆ దిశగా పని చేయాలని అన్నారు. రానున్న రోజుల్లో అటవీ పునరుజ్జీవనంపై మరింత దృష్టి పెట్టినట్టు ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/