శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఒవైసీ

akbaruddin-owaisi-as-protem-speaker

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ సమావేశాల్లో తొలి సమావేశాలకు ప్రొటెం స్పీకర్‌గా ఎవరు వ్యవహరిస్తారనే చర్చకు తెరపడింది. అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. శనివారం ఉదయం 8.30గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో అక్బరుద్దీన్‌ చేత గవర్నర్‌ ప్రమాణం చేయించనున్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో మొదటగా ప్రమాణ స్వీకారం చేయించి స్పీకర్‌ను ఎన్నుకునేంత వరకు ప్రొటెం స్పీకర్‌ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. రేపటి (శనివారం) నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నాలుగో రోజులపాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.

కాగా, సీనియారిటీ ప్రకారం బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాల్సి ఉంది. ఆయన 8 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. కానీ ఈరోజు ఆయన కాలు జారిపడటంతో గాయాలయ్యాయి. దాంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనకు 8 వారాల పాటు విశ్రాంతి అవసరమని చెప్పారు. ఇక తర్వాత వరుసలో బీఆర్ఎస్ నుంచి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ఉండగా, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్‌ నుంచి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. కాంగ్రెస్‌ నేతలు ఇద్దరూ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. దాంతో రేవంత్‌ సర్కారు అక్బరుద్దీన్ ఒవైసీ వైపు మొగ్గుచూపింది. ప్రభుత్వ వినతిని అక్బరుద్దీన్‌ స్వీకరించారు.