చిరంజీవికి షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

మెగాస్టార్ చిరంజీవి కి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. జూబ్లీహిల్స్ హౌసింగ్‌ సొసైటీలో చిరంజీవి కొనుగోలు చేసిన స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివాదాస్పదమైన ఆ స్థలం యథాతథంగా కొనసాగాలని జూబ్లీహిల్స్ సొసైటీకి, చిరంజీవికి హైకోర్టు ఆదేశించింది. ప్రజోపయోగం కోసం ఉద్దేశించిన 595 చదరపు గజాల స్థలాన్ని జూబ్లీహిల్స్ సొసైటీ చిరంజీవికి విక్రయించిందంటూ జె.శ్రీకాంత్ బాబు, ఇతరులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మార్చి 14న హైకోర్టులో విచారణ జరిగింది.

595 చదరపు గజాల అమ్మకాలకు సంబంధించిన సొసైటీ మేనేజింగ్‌ కమిటీ, వార్షిక సర్వసభ్య సమావేశం ఆమోదం చెప్పిన రికార్డులను తెప్పించుకొని పరిశీలించాలని పిటిషనర్ల న్యాయవాది కోరారు. ప్రజావసరాల కోసం నిర్దేశించిన స్థలాన్ని జీహెచ్‌ఎంసీ స్వాధీనం చేసుకోలేదన్నారు. అదే స్థలాన్ని చిరంజీవికి విక్రయించారని చెప్పారు. వాదనల తర్వాత స్టేటస్‌ కో ఉత్తర్వులు జారీచేసిన హైకోర్టు తదుపరి విచారణను ఏప్రిల్‌ 25కి వాయిదా వేసింది.