వైఎస్ వివేకా హత్యకు నాలుగేళ్లు..ఆడబిడ్డకు న్యాయం చేస్తాడా అని ట్విట్టర్ లో ప్రశ్నించిన చంద్రబాబు

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురై నేటికి నాలుగేళ్లు పూర్తి అయ్యింది. ఇప్పటివరకు హత్య చేసిన వారికీ శిక్ష పడలేదు. కోర్ట్ లలో ఈ కేసు ఫై విచారణ జరుగుతూనే ఉంది. ఈక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికైనా న్యాయం చేయాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జస్టిస్ ఫర్ వివేకా అంటూ బుధవారం ట్వీట్ చేశారు. వైఎస్ వివేకా హత్య జగనాసుర రక్త చరిత్రేనని పులివెందుల పూల అంగళ్ల నుంచి ఏపీలోని ప్రతీ ఒక్కరికీ తెలుసని చంద్రబాబు ట్వీట్ చేసారు.

వైఎస్ వివేకా హత్యకు కుట్ర జరిగింది ఆ ఇంట్లోనేనని, ఇది జగనాసుర రక్త చరిత్రేనని చంద్రబాబు విమర్శించారు. తండ్రి శవం పక్కన ఉండగానే సీఎం పదవి కోసం సంతకాలు సేకరించిన వ్యక్తి, బాబాయి హత్యతో రాజకీయ లబ్ది పొందిన వ్యక్తి ఇప్పుడు ఆడబిడ్డకు న్యాయం చేస్తాడా అంటూ వివేకా హత్య పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు.

మరోపక్క వివేకా హత్య పై ఆయన కుమార్తె సునీతారెడ్డి స్పందించారు. ఈ కేసులో నిజాలు కచ్చితంగా బయటకు రావాలని ఆమె అన్నారు. వివేకా వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌ జిల్లా పులివెందులలోని ఆయన ఘాట్‌ వద్ద నివాళులర్పించిన అనంతరం సునీత మీడియాతో మాట్లాడారు.

‘‘కొందరు వ్యక్తులు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారు. నాకు తెలిసిన విషయాలన్నీ సీబీఐకి డాక్యుమెంట్లలో రూపంలో సమర్పించాను. కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తున్నానని నాకు తెలుసు. హత్య కేసులో ప్రయేయం ఉందని నమ్ముతున్నందునే వారిపై సీబీఐకి అన్ని విషయాలు తెలియజేస్తున్నాను. నాన్న హత్యపై గతంలో కొందరు తేలిగ్గా మాట్లాడారు. కడప, కర్నూలు వంటి ప్రాంతాల్లో ఇలాంటివి మామూలే కదమ్మా అన్నారు. నాన్నను ఎవరు హత్య చేశారో తెలుసుకోకుండా ఎలా వదిలిపెట్టగలను?’’ అని సునీత వ్యాఖ్యానించారు.