నేడు తెలంగాణలో హరితోత్సవం..తుమ్మలూరు పార్కులో మొక్కలు నాటనున్న కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు హరితోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతరించిపోతున్న అడవులకు పునరుజ్జీవం పోయడం.. ఫల, ఔషధ మొక్కలు పెంచి ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యేడు ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నది. అన్ని శాఖలు సైతం సమష్టిగా పచ్చదనం పెంపునకు చేస్తున్న కృషి ఫలిస్తున్నది. ఫలితంగా ఎటుచూసినా పచ్చదనం వెల్లివిరుస్తున్నది. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, డీఎస్‌ఎఫ్‌ డీసీ, టీఎస్‌ఐఐసీ, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ విభాగాల ద్వారా ఫారెస్ట్‌ బ్లాక్‌లను అర్బన్‌ బ్లాకులుగా అభివృద్ధి చేస్తున్నారు. పల్లె ప్రగతిలో 867 పల్లె ప్రకృతి వనాలు, 105 బృహత్‌ పల్లె ప్రకృతి వనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పట్టణాల్లోనూ 257 పారులను అందుబాటులోకి తెచ్చారు. జిల్లా మీదుగా వెళ్తున్న ఔటర్‌ రింగ్‌ రోడ్డు సైతం ప్లాంటేషన్‌తో కొత్తందాలకు నిలయంగా మారింది. చెరువు కట్టలపై, పొలం గట్ల వెంట, ఖాళీ స్థలాల్లో విస్తృతంగా మొకలను నాటేలా చర్యలు తీసుకున్నారు. తొమ్మిదేండ్లలో 7 కోట్లకుపైగా మొకలను నాటడంతో జిల్లాలో పచ్చదనం 99.54 శాతానికి పెరిగింది.

ఇక దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు తెలంగాణ హరితోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్‌ రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని తుమ్మలూరు అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులో మొక్కలు నాటనున్నారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని అధికారులు ఏర్పాట్లు చేశారు