గజపతినగరం మాజీ ఎమ్మెల్యే తాడ్డి సన్యాసినాయుడు మృతి

విజయనగరం జిల్లా గజపతినగరం మాజీ ఎమ్మెల్యే తాడ్డి సన్యాసినాయుడు (90) కన్నుమూశారు. కొన్నేళ్లుగా గజపతినగరంలో ఉంటున్న ఆయన వారం రోజుల క్రితం బాత్రూంలో జారిపడ్డారు.దీంతో విశాఖపట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలోచేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం విషమంగా మారి కన్నుమూశారు.

సన్యాసినాయుడు విజయనగరం ఎమ్మార్‌ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆయనకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. 1959లో సోషలిస్టు పార్టీ తరుపున తొలిసారి గజపతినగరం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. నీలం సంజీవరెడ్డి హయాంలో 1962లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1972లో గజపతినగరం సమితి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. కోట్ల విజయభాస్కరరెడ్డి హయాంలో రాష్ట్ర చిన్న నీటి పారుదలశాఖ చైర్మన్‌గా పనిచేశారు. గజపతినగరం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా కూడా పదవి దక్కింది. కో ఆప్షన్ సభ్యునిగా పనిచేశారు. 2001లో జరిగిన జడ్పీ ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌ అభ్యర్థి విజయానికి విస్తృత ప్రచారం నిర్వహించారు. 2005 వరకూ కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

వయోభారం,అనారోగ్య సమస్యల వల్ల పదేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వెంకటరావు, భాస్కరరావు, రవి, శ్రీపతిలో పెద్ద కుమారుడు వెంకటరావు తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించారు. సన్యాసినాయుడు మృతితో గజపతినగరం నియోజకవర్గంలో విషాద ఛాయలు అలముకున్నాయి. స్వగ్రామం చల్లపేటలో నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. అభిమానుల సందర్శనార్థం కొద్ది సేవు ఉంచి అనంతరం ఇక్కడే అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.