తెలంగాణ లో ఒంటి పూట బడులు ఎప్పటి నుండి అంటే…

రోజు రోజుకు ఎండ తీవ్రత భారీగా పెరుగుతుంది. గత వారం రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 9 దాటితే చాలు కాలు బయట పెట్టాలంటే భయం వేస్తుంది. అంతలా ఎండలు పెరిగిపోయాయి. ఫిబ్రవరి ఇంకా పూర్తి కానేలేదు అప్పుడే ఈ రేంజ్ లో ఎండలా అని అంత మాట్లాడుకుంటున్నారు. మరోపక్క వాతావరణ నిపుణలు సైతం ఈ ఏడాది ఎండలు దంచికొడతాయని చెపుతున్నారు. ఈ ఏడాది ఊహించిన ‘ఎల్ నినో’ కారణంగా వేసవి కాలం కఠినంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా రుతుపవనాలపై కూడా ఆ ఎఫెక్ట్ పడనుందని తెలుస్తోంది.

ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ ఒంటి పూట బడులు తేదీని ఫిక్స్ చేసింది. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు స్కూల్స్‌కు ఈ ఏడాది వేసవి సెలవులు ఉంటాయని గతంలోనే విద్యాశాఖ వెల్లడించగా..ఇక ఒంటి పూట బడులు మార్చి 15 నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలిపింది. ఒక్క పూట బడులు సమయంలో ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు నిర్వహించనున్నారు. ఈ సమయంలో ప్రవేట్ స్కూళ్లతో పాటు ప్రభుత్వ స్కూళ్లల్లో మెరుగైన మంచినీరు పిల్లలకు అందేలా చూడాలని విద్యాశాఖ సూచించింది. అలాగే తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 3 నుంచి 13 వరకు జరుగుతాయి. మిగిలిన తరగతులకు ఏప్రిల్ 12 నుంచి ప్రారంభించాలని తాజాగా విద్యాశాఖ నిర్ణయించింది. 1-5 తరగతుల వారికి నాలుగు సబ్జెక్టులే అయినందున వారికి ఏప్రిల్ 17తో ముగుస్తున్నాయి.