”దేశ్ కీ నేత కేసీఆర్” అనే పాటను విడుదల చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

రేపు కేసీఆర్ పుట్టిన రోజు సందర్భాంగా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా పుట్టిన రోజు వేడుకలు జరపబోతున్నారు నేతలు. ఇప్పటికే తెలంగాణ లోని జిల్లాలన్నీ కూడా గులాబీమయం చేసారు. ప్రజా నాయకుడి జన్మదినం సందర్భంగా యావత్‌ ప్రజానీకం పులకించిపోతున్నది. జననేతకు పుట్టినరోజు కానుక ఇచ్చేందుకు సబ్బండ వర్ణాలు కదం తొక్కుతున్నాయి. కేక్‌ కటింగ్‌లతోపాటు మొక్కలు నాటడం.. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు నాయకులు, పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నారు. సామాన్య ప్రజానీకం సైతం భాగస్వామ్యులై వాడవాడల్లో పండుగలా పుట్టినరోజు వేడుకలను జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఈ తరుణంలో హైదరాబాద్ లోని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ రూపొందించిన ”దేశ్ కీ నేత కేసీఆర్” అనే పాటను తెలంగాణ సాంస్కృతిక, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడులకను పురస్కరించుకుని ఈ పాటను రూపొందించారు. ఈ పాటను తన నివాసంలో ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ ప్రతి సంవత్సరం ఉద్యమ కాలం నాటి నుంచి నేటి వరకు కూడా కేసీఆర్ జన్మదిన సందర్బంగా పాటను రూపొందించడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాడన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ వచ్చిందని, తెలంగాణ అభివృద్ధి అవుతోందని, అన్ని పరిశ్రమల మాదిరిగానే తెలుగు చలన చిత్ర పరిశ్రమ కూడా అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కేవలం సినిమా వాళ్ళకే కాదు సినిమా కార్మికులకు కూడా కేసీఆర్ అండగా నిలిచారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశంసంచారు.

ఇక హైదరాబాద్‌ నగరంలోని ప్రధాన కూడళ్లు, వీధులు గులాబీరంగును పులుముకున్నాయి. ‘దేశ్‌ కీ నేత కేసీఆర్‌’ వంటి నినాదాలతో ఎటుచూసినా హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. 2001లో ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చెంది దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలో దేశ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు, నేతలు రహదారుల వెంట భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.