నేడు తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు

తెలంగాణ ఎంసెట్​ పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. ఉదయం 9.30 గంటలకి విడుదల కానున్నాయి. ముందుగా ఉదయం 11 గంటలకు ఫలితాలను వెల్లడిస్తామని అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, అదే సమయానికి రాష్ట్ర అవతరణ వేడుకలపై సీఎం కేసీఆర్‌తో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉండడం, అందులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా పాల్గొనాల్సి ఉండడంతో ఎంసెట్ ఫలితాల విడుదల సమయాన్ని ముందుకు జరిపారు.

నేడు ఉదయం 9.30 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వి.కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆచార్య ఆర్‌. లింబాద్రి, జేఎన్‌టీయూ-హైదరాబాద్‌ వీసీ ప్రొఫెసర్‌ కట్టా నరసింహా రెడ్డి తదితరులు ఫలితాల విడుదల కార్యక్రమంలో పాల్గొననున్నారు.

అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి ర్యాంకులు చెక్ చేసుకోవచ్చు. ఫలితాల తర్వాత విడతల వారీగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అభ్యర్థికి వచ్చిన ర్యాంకు, కోర్సు, కళాశాల, అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా అడ్మిషన్ కేటాయిస్తారు. సీటు కేటాయించిన తర్వాత.. సదరు అభ్యర్థి సంబంధిత కాలేజీకి వెళ్లి రిపోర్ట్ చేయాలి.

తెలంగాణలో ఫిబ్రవరి నెల 28న ఎంసెట్​ నోటిఫికేషన్​ను ప్రభుత్వం విడుదల చేసింది. మే 10 నుంచి 14 వరకు ఈ పరీక్ష నిర్వహించారు.