ఈనెల 15న బిఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల

Telangana CM KCR to launch BRS manifesto for assembly polls on October 15

హైదరాబాద్‌ః తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన వేళ అధికార బిఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. ఈ నెల 15న పార్టీ అధినేత సిఎం కెసిఆర్ తెలంగాణ భవన్‌లో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అదేరోజు ఉదయం పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు అందించి, ఆ సాయంత్రం హుస్నాబాద్‌లో బహిరంగ సభతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మరుసటి రోజు భువనగిరి, జనగామ నియోజక వర్గాల్లో బహిరంగ సభలు, 17న సిద్దిపేట, సిరిసిల్ల, 18న జడ్చర్ల, ఆ రోజు సాయంత్రం మేడ్చల్‌లో బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు.

కాగా, గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా హైదరాబాద్‌కు ఈశాన్యాన ఉన్న హుస్నాబాద్‌లో తొలి బహిరంగ సభతో ఎన్నికల ప్రచారానికి సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ఇక గజ్వేల్, కామారెడ్డి స్థానాల నుంచి పోటీ చేస్తానని కెసిఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో నవంబర్ 9న ఆ రెండు చోట్లా నామినేషన్ వేయనున్నారు. అయితే, ఆనవాయతీ ప్రకారం ఆయన తొలుత సిద్దిపేట నియోజకవర్గం కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాక తొలుత గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో నామినేషన్ వేస్తారు.