నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

CM KCR's Maharashtra tour canceled
CM KCR

హైదరాబాద్ః నేడు సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరుగనుంది. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. శాసనసభ సమావేశాలపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈ నెల ఆరో తేదీ నుంచి ఉభయ సభలు సమావేశం కానున్నాయి. సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహం, సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. విపక్షాలను దీటుగా ఎదుర్కొనే విషయమై మంత్రులకు ముఖ్యమంత్రి కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కూడా చర్చించే అవకాశం ఉంది.

భారత్‌లో తెలంగాణ విలీనమై 74 ఏండ్లు పూర్తయ్యి 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో తెలంగాణ వజ్రోత్సవాల నిర్వహణ, పోడుభూముల సమస్య పరిష్కారం తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశమున్నట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా తెలంగాణపై ఆర్థిక ఆంక్షలు విధించిన నేపథ్యంలో అదనపు వనరుల సమీకరణపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. మహిళా యూనివర్సిటీ, సాగునీటి పారుదల రంగానికి చెందిన అంశాలు, ఉద్యోగులకు డీఏ పెంపు తదితర అంశాలపై క్యాబినెట్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/